అక్షరటుడే, నిజామాబాద్‌ సిటీ: తండాలో గుడుంబా కాస్తున్నారనే సమాచారంతో అక్కడికి వెళ్లిన పోలీసులను అడ్డుకున్న నలుగురు వ్యక్తులకు న్యాయస్థానం రెండేళ్ల జైలుశిక్ష, జరిమానా విధించింది. వివరాల్లోకి వెళ్తే.. మోపాల్‌ మండలంలోని శ్రీరాంనగర్‌ తండాలో 2017లో కెతావత్‌ తిరుపతి, కెతావత్‌ లక్ష్మీబాయి, కెతావత్‌ గోకుల్‌, గుగ్లోత్‌ దేవేందర్‌ తమ ఇళ్ల వద్ద గుడుంబా కాస్తున్నారనే సమాచారం రాగా పోలీసులు దాడులు చేశారు. అయితే వీరు పోలీసులను అడ్డుకుని దుర్భాషలాడారు. దీంతో నిందితులపై మోపాల్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. కాగా.. గురువారం అదనపు జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ నలుగురికి రెండేళ్ల జైలుశిక్ష, రూ. 2వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. కేసును విచారణ చేసిన వారిలో ఏపీపీవో భూసారపు రాజేష్ గౌడ్, మోపాల్ ఎస్సై సతీష్, ఎస్సై యాదగిరి, ఏఎస్సై రమేష్, కోర్టు లైజన్ ఆఫీసర్ శ్యామ్ కుమార్, కానిస్టేబుళ్లు శ్యామ్ రావ్, సంతోష్ కుమార్ ఉన్నారు.