అక్షరటుడే, వెబ్‌డెస్క్ : మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాస ఘడియలు సోమవారం ఉదయం 6.57 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈనేపథ్యంలో డిసెంబరు 17వ తేదీ నుంచి తిరుమలలో వేంకటేశ్వరస్వామి వారికి నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదిస్తారు. కాగా జనవరి 14న ధనుర్మాస ఘడియలు ముగియనున్నాయి. ధనుర్మాసం సందర్భంగా శ్రీవారికి విశేష కైంకర్యాలు నిర్వహిస్తారు. ప్రతి రోజూ బిల్వ పత్రాలతో సహస్ర నామార్చన చేస్తారు. శ్రీవిల్లి పుత్తూరు చిలుకలను స్వామివారికి అలంకరిస్తారు. శ్రీవారికి విశేష నైవేద్యాలుగా దోశ, బెల్లం దోశ, సుండలు, సీరా, పొంగల్ వంటి ప్రసాదాలను నివేదిస్తారు.
తిరుమలలో జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు
శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 19వ తేది వరకు వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యమిస్తూ ఆదివారం టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంది.
• దర్శన టోకెన్లు/టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తారు. టోకెన్లు లేని భక్తులను తిరుమలకు అనుమతిస్తారు కానీ దర్శనం చేసుకునే అవకాశం ఉండదు.
• చంటి బిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, రక్షణ శాఖ, ఎన్ఆర్ఐ మొదలైన విశేష దర్శనాలు ఈ పది రోజుల పాటు రద్దు.
• ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు పది రోజుల పాటు రద్దు.
• భారీ క్యూలైన్లు నివారించి గరిష్ట సంఖ్యలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు చేయించేందుకు ఏర్పాట్లు.
• గోవిందమాల ధరించిన భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఉండవు. దర్శన టోకెన్లు/టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తారు.
• భక్తులకు కేటాయించిన టైంస్లాట్ ప్రకారమే క్యూలైన్ల వద్దకు చేరుకోవాలని సూచన.
• మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ బ్యూరోక్రాట్లు, మాజీ ఛైర్మన్ లను వైకుంఠ ఏకాదశి రోజున దర్శనాలకు అనుమతించబడరు. 11 నుంచి 19వ తేది వరకు వీరిని దర్శనాలకు అనుమతిస్తారు.
• 3వేల మంది యువ శ్రీవారి సేవకులను, అవసరమైన మేరకు యువ స్కౌట్స్&గైడ్స్ ను నియమించుకుని వారి సేవలను క్యూలైన్ల నిర్వహణకు వినియోగించుకోవడం జరుగుతుంది.