అక్షరటుడే, వెబ్ డెస్క్: రాష్ట్ర రైతాంగానికి రెండో విడత రుణమాఫీ నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. అసెంబ్లీ ప్రాంగణంలో మంగళవారం నిర్వహించిన నిధుల విడుదల కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలోని రైతులను రుణ విముక్తులను చేయాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్‌లో రూ.రెండు లక్షల రుణమాఫీ ప్రకటించారని గుర్తుచేశారు. ఈ మేరకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రూ.లక్షన్నరలోపు రూ.6,190 కోట్ల రుణాలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. ‘రుణమాఫీపై మాట తప్పుతామని అందరూ భావించారు. కానీ రైతు సంక్షేమంపై కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదని’ వ్యాఖ్యానించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లలో రూ.25వేల కోట్లు మాఫీచేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఒకే దఫాలో రూ.31వేల కోట్లు మాఫీ చేసిందని తెలిపారు. రాజకీయాల కోసం ఈ నిర్ణయం తీసుకోలేదని.. రైతుల కోసం దేశ చరిత్రలో లేనివిధంగా రూ.2 లక్షల వరకు రైతుల రుణమాఫీ చేశామని చెప్పారు. రాష్ట్ర ఖజానాపై భారం పడినా ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.