అక్షరటుడే, వెబ్‌డెస్క్: నిజామాబాద్ నగర శివార్లలో దర్జాగా మొరం దందా సాగుతోంది. అక్రమార్కులు రాత్రి పూట తవ్వకాలు జరిపి మొరం గుట్టలను మాయం చేస్తున్నారు. అధికార పార్టీ నేతలే తవ్వకాలు చేపడుతుండటంతో పలుచోట్ల స్థానిక పోలీసులు, రెవెన్యూ అధికారులు అక్రమ మైనింగ్‌కు సహకరిస్తున్నారు.
- మోపాల్ మండలంలోని నర్సింగ్‌పల్లి శివారు- సిరిపూర్ గుట్ట నుంచి గత కొద్ది రోజులుగా మొరం తవ్వకాలు జరుగుతున్నాయి. మైనింగ్ శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేకపోయినా తాత్కాలిక అనుమతుల(టీపీ) పేరిట అధికార పార్టీకి చెందిన ఓ చోటా నేత తవ్వకాలు చేపడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే పేరు చెప్పుకుని చీకటి పడగానే నిత్యం పెద్ద ఎత్తున టిప్పర్లలో నిజామాబాద్‌కు మొరం తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.
- నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్కాపూర్, గుండారం ప్రాంతాల్లో మొరం తవ్వకాలు చేపడుతున్నారు. మైనింగ్ శాఖ నుంచి అనుమతులు తీసుకోకుండానే ప్రభుత్వ స్థలాల్లో ఉన్న మొరాన్ని తోడేస్తున్నారు. ఇటీవల ఈ విషయమై పోలీసుల వరకు ఫిర్యాదు వెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలేశారు.
- మల్లారం శివారులోని మరో గుట్ట నుంచి స్థానికంగా ఉండే మొరం వ్యాపారులు అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారు. చీకటి పడగానే తవ్వకాలు జరిపి ఐదో ఠాణా ఎదుట నుంచే నిజామాబాద్ నగరానికి తరలిస్తున్నారు. అయినా పోలీసులు మాత్రం తమకేమీ తెలియనట్లు వ్యవహరిస్తున్నారు.
అడ్డుకునే వారు లేక..
అక్రమ మైనింగ్ విషయంలో కఠినంగా వ్యవహరించాలని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇదే విషయంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతుతో పాటు ఇన్‌ఛార్జి సీపీ సింధుశర్మ కఠినంగా వ్యవహరిస్తున్నారు. కానీ మైనింగ్, రెవెన్యూ, పోలీసు శాఖల మధ్య సమన్వయం లేక అక్రమ మైనింగ్‌కు ఏమాత్రం అడ్డుకట్ట పడట్లేదు. ప్రత్యేకించి పలు శాఖల అధికారులు మామూళ్లు తీసుకొని అక్రమార్కులకు అండదండలు అందిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.