అక్షరటుడే, బోధన్: బోధన్ పట్టణంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికులు ఈ ఘటనను హత్యగా భావిస్తున్నారు. కుటుంబీకులే హతమార్చినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని కురుమగల్లీకి చెందిన శంకర్(45) శనివారం రాత్రి పశువుల కొట్టంలో నిద్రించగా.. ఉదయం లేచి చూసేసరికి శవమై కనిపించాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా.. ఊపిరాడక మృతి చెంది ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అయితే మృతుడి చిన్న కూతురు తండ్రి మృతిపై అనుమానం రావడంతో స్థానికుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.