అక్షరటుడే, వెబ్ డెస్క్: ఇద్దరు బాలికలను ప్రిన్సిపల్ విచక్షణారహితంగా కొట్టి గాయపరిచిన ఘటన యాదాద్రి- భువనగిరి జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. వలిగొండ మండలంలోని లోతుకుంట ఆదర్శ పాఠశాలలో అక్షిత, అఖిల ఎనిమిదో తరగతి చదువుతున్నారు. ఈ నెల 12న ఉదయం వారు జావ తాగుతుండగా.. “ఎంత సేపు తాగుతారు..” అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిని ప్రిన్సిపల్ రహిసున్నిసా బేగం పైపుతో కొట్టారు. భయపడిన బాలికలు గాయాల గురించి తల్లిదండ్రులకు చెప్పకుండా మరుసటి రోజు యథావిధిగా బడికి వచ్చారు. వారిని పిలిచి ఎలా ఉందని ప్రిన్సిపల్ అడిగారు. అనంతరం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇద్దరికీ ఫ్రాక్చర్ అయినట్లు గుర్తించి చికిత్స అందించారు. తర్వాత రెండ్రోజులు సెలవులు కావడంతో విషయం బయటకు పొక్కలేదు. సోమవారం తల్లిదండ్రులు ప్రిన్సిపల్ ను నిలదీయగా.. ‘క్షమించండి.. మరోసారి ఇలాంటి పొరపాటు చేయను.. ఆసుపత్రి ఖర్చులు భరిస్తా’ అని ప్రిన్సిపల్ సమాధానం చెప్పినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. దీనిపై ప్రిన్సిపల్ స్పందిస్తూ.. “క్రమశిక్షణ పాటించాలని నెమ్మదిగానే కొట్టానని” అంటున్నారు. వాలీబాల్ ఆడుతుంటే చేయికి దెబ్బతగిలితే కట్లు కట్టించామన్నారు. ఎంఈవో భాస్కర్ పాఠశాలకు వెళ్లి పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి జిల్లా విద్యాధికారికి నివేదిక సమర్పిస్తామని వివరణ ఇచ్చారు.