అక్షరటుడే, ఎల్లారెడ్డి: అదుపుతప్పి కారు పొలాల్లోకి దూసుకెళ్లిన ఘటన నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హెచ్‌ఎంబీ రహదారిపై ఎల్లారెడ్డి వైపు నుంచి మెదక్‌ వైపు వెళ్తున్న ఓ కారు మంగళవారం ఉదయం నాగిరెడ్డిపేట సమీపంలోకి రాగానే అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. రోడ్డు నుంచి పొలం చాలా కిందికి ఉన్నా.. బురదగా ఉండడంతో ప్రాణాపాయం తప్పింది. ఘటనలో కారులో ఉన్న ఐదుగురు సురక్షితంగా బయటపడ్డారు.