అక్షరటుడే, వెబ్‌డెస్క్: ఇసుక అక్రమ రవాణాదారుల నుంచి మామూళ్ల వసూలు అంశం పోలీసు శాఖలో తీవ్ర చర్చకు దారితీసింది. పలువురు అధికారుల పేర్లు, వివరాలతో కూడిన జాబితాతో ఇటీవల మెమో జారీ అయ్యింది. ఉన్నఫలంగా వారిని బదిలీ చేయడంతో పాటు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీ కార్యాలయం నుంచి ఆదేశాలందాయి.
కమిషనరేట్ పరిధిలో మొత్తం 11 మంది పోలీసు అధికారులపై ఇసుక అక్రమ రవాణా ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. వీరిలో 9 మంది పలు స్టేషన్ల ఎస్సైలుండగా.. ఇద్దరు సీఐలు ఉన్నారు. కాగా. ఓ సీఐని ఇప్పటికే లూప్‌లైన్‌కు పంపగా.. మరో సీఐ ఇతర జిల్లాకు బదిలీపై వెళ్లిపోయారు.
ఎస్సైలకు రూ.లక్షల్లో మామూళ్లు..
బోధన్ రూరల్ ఎస్సైగా గతంలో పనిచేసి ప్రస్తుతం బాల్కొండ నియోజకవర్గానికి వెళ్లిన అధికారికి లంగ్డాపూర్, హంగర్గ ప్రాంతాల నుంచి నెలనెలా రూ.8 లక్షల వరకు మామూళ్లు అందేవని మెమోలో పేర్కొన్నారు. కాగా ఇప్పటివరకు సదరు అధికారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా.. బాల్కొండ నియోజకవర్గంలో కీలకమైన స్టేషన్‌కు ఎస్‌హెచ్‌వోగా పోస్టింగ్ ఇచ్చారు. రుద్రూర్ సర్కిల్‌లో పనిచేస్తున్న మరో ఎస్సై అర్ధరాత్రిళ్లు ఇసుక ట్రాక్టర్లు, లారీలకు కాపలా ఉండి మరీ అక్రమ రవాణాను ప్రోత్సహిస్తున్నట్లు ప్రచారంలో ఉంది. ఒక్కో ట్రాక్టర్, లారీ నుంచి రూ.20వేల వరకు వసూలు చేస్తున్నారు. రుద్రూర్, డిచ్‌పల్లి, ధర్పల్లి, బోధన్ రూరల్ సర్కిల్‌లో పనిచేసిన ఎస్సైలపై బలమైన ఆరోపణలున్నాయి. కాగా.. వీరిలో పలువురు బదిలీ కాగా.. మిగతా వారు ఇప్పటికీ పాత స్థానాల్లోనే కొనసాగుతున్నారు. సత్వరమే ప్రస్తుత విధుల నుంచి తప్పించి కఠిన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు వచ్చినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం కొసమెరుపు. ఇదే అదునుగా పలువురు ఎస్సైలు మితిమీరి వ్యవహరిస్తున్నారే ప్రచారం జరుగుతోంది.