అక్షరటుడే, ఇందూరు: క్రీడాకారులు లక్ష్యంతో ముందుకెళ్తే విజయం ఖాయమని కార్పొరేషన్ కమిషనర్ మకరంద్ అన్నారు. ఖేలో ఇండియా మహిళల సౌత్ జోన్ సైక్లింగ్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. సౌత్ జోన్ పోటీలు నిజామాబాద్ లో నిర్వహించడం అభినందనీయమన్నారు. తల్లిదండ్రులు చదువుతో పాటు క్రీడలను కూడా ప్రోత్సహించాలన్నారు. ఓడిన క్రీడాకారులు నిరాశ పడకుండా భవిష్యత్తులో ఉత్తమ ప్రతిభ కనబరచాలన్నారు. గెలుపొందిన వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలన్నారు. అనంతరం గెలుపొందిన క్రీడాకారులకు పతకాలను అందజేశారు. కార్యక్రమంలో ఒలింపిక్ సంఘం జిల్లా అధ్యక్షుడు ఈగ సంజీవరెడ్డి, సైక్లింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కృపాకర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ కాంత్, రాజ్ కుమార్ సుబేదార్, ఖేలో ఇండియా ప్రతినిధులు పాల్గొన్నారు.

కర్ణాటక హవా..

సౌత్ జోన్ సైక్లింగ్ పోటీల్లో కర్నాటక జట్టు తమ సత్తా చాటింది. జూనియర్, సీనియర్ విభాగంలో మొదటి మూడు స్థానాలు కర్నాటక క్రీడాకారులు కైవసం చేసుకున్నారు. 2022 ఏషియన్ గేమ్స్ లో పాల్గొన్న ఆ రాష్ట్రానికి చెందిన సీ.హెచ్.నంద టోర్నీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.