అక్షరటుడే, నిజామాబాద్సిటీ: విచారణ నిమిత్తం పోలీసులు తీసుకెళ్లిన వ్యక్తి పురుగుల మందు తాగినట్లు అతని భార్య ఆరోపించింది. బాధితురాలి కథనం ప్రకారం.. బోధన్ మండలం కల్దుర్కికి చెందిన రాజు తన భార్య లక్ష్మితో కలిసి నగరానికి వలస వచ్చాడు. గూపన్పల్లిలోని ఓ డాక్టర్ షెడ్లో దంపతులు ఇద్దరు ఐదేళ్లుగా పని చేస్తున్నారు. అయితే ఇటీవల వీరు తమ బంధువుల పెళ్లికి హాజరయ్యారు. అక్కడ చోరీ జరగడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వీరు పని చేసే షెడ్ వద్దకు వచ్చిన ముగ్గురు రాజును తీసుకెళ్లారు. ఎందుకు తీసుకెళ్తున్నారని అడిగితే విచారణ కోసమని చెప్పారని ఆమె తెలిపారు. కాగా వారు పని చేసే డాక్టర్ ఆమెకు ఫోన్ చేసి రాజు ఆస్పత్రిలో ఉన్నాడని చెప్పారన్నారు. తీరా అక్కడికి వెళ్లాక తన భర్త గడ్డి మందు తాగాడని వైద్యులు చెప్పారని లక్ష్మి వాపోయింది. పోలీసులు తీసుకెళ్లిన వ్యక్తి గడ్డి మందు ఎలా తాగుతాడని ప్రశ్నించింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. కాగా ప్రస్తుతం రాజు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే సీసీఎస్ పోలీసులు మాత్రం ఈ విషయమై తమకేమీ సంబంధం లేదని చెప్పడం, ఆస్పత్రిలో అడ్మిట్ చేసే సమయంలో ఎలాంటి వివరాలు రాయించకుండా జాగ్రత్త పడడం అనుమానాలకు తావిస్తోంది.