అక్షరటుడే, నిజామాబాద్: నగరంలో సైబర్ నేరగాళ్ల ముఠాను పోలీసులు గుట్టురట్టు చేశారు. నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో నిందితులను అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 9వ తేదీ అర్ధరాత్రి సమయంలో బసకొండ నరేశ్ అనే బాధితుడు బ్యాంకు ఖాతా నుంచి రూ.1,04,999 డెబిట్ అయ్యాయి దీంతో బాధితుడు జనవరి 11న పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సీఐ శ్రీనివాస్ రాజ్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలతో ఆటోనగర్ కు చెందిన మొహమ్మద్ అబ్దుల్ జవాద్(23), గుడుముల నితీష్(24)(బోధన్) ఖాతాల్లోకి నగదు వెళ్లినట్లు గుర్తించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తక్కువ కాలంలో అధిక డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో వీరు రాజస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న సైబర్ నేర ముఠాతో వివిధ బ్యాంకుల్లో ఖాతాలను తెరిపించి అక్రమాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. కేసు దర్యాప్తులో కీలక పాత్ర పోషించిన సీఐ శ్రీనివాస్ రాజ్, నాలుగో టౌన్ ఎస్సై శ్రీకాంత్, సిబ్బందిని ఏసీపీ అభినందించారు.