ఇటీవల 11 మంది ఎమ్మెల్యేల రహస్య భేటీ!

మరునాడే మంత్రులతో సీఎం మంతనాలు

ఎమ్మెల్యేలతో దీపాదాస్ మున్షీ భేటీ

ఆ వెంటనే ఢిల్లీకి సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్

టీపీసీసీలో ముసలం నిజమేనా..!

అక్షరటుడే, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. ఆ పార్టీలో ముసలం మొదలైందా.. అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 11 మంది హస్తం పార్టీ ఎమ్మెల్యేలు ఇటీవల హైదరాబాద్ శివార్లలోని ఓ హోటల్‌లో రహస్యంగా సమావేశం అయ్యారనేది ప్రచారంలో ఉంది. ఓ మంత్రి తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. సొంత నియోజకవర్గంలో తమకు తెలియకుండానే మంత్రి నిర్ణయాలు తీసుకుంటున్నారని సదరు ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేశారని తెలుస్తోంది. బీఆర్ఎస్ నేతలకు ప్రభుత్వంలో పనులు అవుతున్నాయని, కానీ సొంత పార్టీ ఎమ్మెల్యేలకు మాత్రం ఆలస్యం చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారని చెబుతున్నారు.

మంత్రులతో సీఎం మంతనాలు…

ఎమ్మెల్యేల రహస్య భేటీ మరుసటి రోజే సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో సమావేశం కావడం మరింత చర్చకు దారితీసింది. ఈ సమావేశానికి పీసీసీ చీఫ్‌ మహేశ్‌ హాజరవడం, మంత్రులతో సీఎం సుదీర్ఘంగా చర్చించడం ఆనాడే చర్చకు దారి తీసింది. పైకి అధికార మీటింగ్ గా చూపినా అంతర్గతంగా రాష్ట్ర పార్టీలో చోటు చేసుకున్న ముసలంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అధికారిక కార్యాలయం కమాండ్ కంట్రోల్ సెంటర్ లో జరిగిన సమావేశానికి పీసీసీ చీఫ్‌ హాజరు కావడం ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చింది.

దిద్దుబాటు చర్యలు..

రాష్ట్ర పార్టీలో చోటు చేసుకున్న అంశాలపై కాంగ్రెస్ అధిష్ఠానం అలర్ట్ అయింది. మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయంపై ఫోకస్ పెట్టింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ నేడు జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో విడివిడిగా మాట్లాడి, పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం పూర్తి కాగానే సీఎం రేవంత్ తో పాటు, పీసీసీ చీఫ్‌ మహేష్‌గౌడ్‌ ను అధిష్ఠానం ఢిల్లీకి పిలిపించుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.

విభేదాలు కొత్తేమి కాదు..

కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు కొత్తేమి కాదు. ఆది నుంచి ఉన్నవే. కొత్త వారికి పదవులు దక్కడం, సీనియర్లు అలక బూనడం తదితరాలు ఆ పార్టీ చరిత్రలో ఎన్నో ఉన్నాయి. అయితే, తెలంగాణలో కాంగ్రెస్ దాదాపు తుడిచిపెట్టుకుపోయిన దశ నుంచి ఏకంగా ప్రభుత్వాన్నే ఏర్పాటు చేయడం అంటే మాములు విషయం కాదు. ఎంతో కష్టపడితే వచ్చిన అధికారాన్ని పదిలంగా కాపాడుకోవాల్సిన సమయంలో కొత్తగా సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచి వ్యతిరేకత రావడమే రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.