నాగర్ కర్నూలు, మంచిర్యాల, ములుగులో పంప్డ్ స్టోరేజీ హైడ్రో పవర్ ప్రాజెక్టులు

హైదరాబాద్, అక్షరటుడే: ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వేదికపై మరో కొత్త రికార్డు నమోదు చేసింది. రాష్ట్రానికి గతంలో ఎన్నడూ లేనంత భారీ పెట్టుబడులను సమీకరించింది. దేశంలో ఇంధన రంగంలో పేరొందిన సంస్థ సన్ పెట్రో కెమికల్స్ తెలంగాణలో రూ.45,500 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంది. భారీ పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్తు, సోలార్ విద్యుత్తు ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నట్లు సన్ పెట్రో కెమికల్స్ సంస్థ ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సన్ పెట్రో కెమికల్స్ ఎండీ దిలీప్ సాంఘ్వీతో చర్చలు జరిపిన అనంతరం వారి సమక్షంలోనే అధికారులు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు.

ఇంధన సామర్థ్యం 3400 మెగావాట్లు

సన్ పెట్రో కెమికల్స్.. నాగర్ కర్నూలు, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో మూడు చోట్ల పంప్డ్ స్టోరేజీ హైడ్రో పవర్ ప్రాజెక్టులను నెలకొల్పనుంది. ఈ మూడు ప్రాజెక్టుల మొత్తం ఇంధన సామర్థ్యం 3400 మెగావాట్లు. వీటికి 5440 మెగావాట్ల సామర్థ్యముండే సోలార్ విద్యుత్తు ప్లాంట్లను అనుసంధానం చేస్తుంది.

నిర్మాణ దశలోనే 7 వేల కొలువులు

ఈ ప్రాజెక్టుల నిర్మాణ దశలోనే దాదాపు 7వేల ఉద్యోగాలు లభిస్తాయి. ఇప్పటివరకు దావోస్ వేదికపై తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న భారీ ఒప్పందం ఇదే కావటం విశేషం. భారీ పెట్టుబడులకు ముందుకు వచ్చిన సన్ పెట్రో కెమికల్స్ ప్రతినిధులను ముఖ్యమంత్రి అభినందించారు. సుస్థిరమైన ఇంధన వృద్ధి సాధించే తెలంగాణ లక్ష్య సాధనలో ఈ ఒప్పందం మైలురాయిగా నిలుస్తుందన్నారు. భవిష్యత్తు ఇంధన అవసరాల దృష్ట్యా క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీకి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని చెప్పారు.

పారిశ్రామికంగా వృద్ధి..

హరిత ఇంధన ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని, సన్ పెట్రో కెమికల్స్ భాగస్వామ్యంతో భవిష్యత్తులో డిమాండ్ కు అనుగుణంగా ఇంధన వనరులు సమకూరుతాయని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందంతో రాష్ట్రంలో యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలతో పాటు నాగర్ కర్నూల్, మంచిర్యాల, ములుగు జిల్లాలు పారిశ్రామికంగా వృద్ధి చెందుతాయన్నారు.