అక్షరటుడే, వెబ్ డెస్క్ : దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం వార్షిక సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం మరో కీలక పెట్టుబడిని రాబట్టింది. రాష్ట్రంలో మానవ రహిత ఏరియల్ సిస్టమ్స్ తయారీ యూనిట్ స్థాపించనున్నట్లు జేఎస్ డబ్ల్యూ సంస్థ ప్రకటించింది. అమెరికా కు చెందిన డిఫెన్స్ టెక్నాలజీ సంస్థ అనుబంధంతో ఈ యూనిట్ నెలకొల్పనుంది. దాదాపు రూ.800 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది.
దీనికి సంబంధించి దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో జేఎస్ డబ్ల్యూ డిఫెన్స్ అనుబంధ సంస్థ అయిన జేఎస్ డబ్ల్యూ యూఏవీ లిమిటెడ్ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో దాదాపు 200 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. రక్షణ రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు తెలంగాణ అభివృద్ధిలో ఈ ప్రాజెక్టు క్రియాశీలంగా మారనుంది.
ఐటీ, ఫార్మాతో పాటు అన్ని రంగాల పరిశ్రమలు తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయని, ఈ ఒప్పందంతో రక్షణ రంగంలో కీలక ఆవిష్కరణలతో పాటు డ్రోన్ టెక్నాలజీకి తెలంగాణ ప్రధాన కేంద్రంగా మారుతుందని సీఎం రేవంత్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం రక్షణ రంగంలో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు అభిప్రాయపడ్డారు.