అక్షరటుడే, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న వారి నిరీక్షణకు తెరపడనుంది. తర్వాత సంక్రాంతి తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో అర్హులైన పేద కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.

పదేళ్లుగా ఎదురుచూపులు..

పదేళ్లు అధికారంలో ఉన్న భారాస సర్కారు.. కొత్త రేషన్ కార్డులు ఇవ్వడంపై ఏనాడు దృష్టి పెట్టలేదు. 2018 ముందస్తు ఎన్నికల సమయంలో రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించడంతో అప్పట్లో పేద ప్రజలు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. దీంతో 2021 నాటికి కొందరికి మాత్రమే ఆహార భద్రత కార్డులు మంజూరు చేసి, ఆ తర్వాత నాటి ప్రభుత్వం పంపిణీ ప్రక్రియను అటకెక్కించింది. చనిపోయినవారి పేర్లను తొలగించారే తప్ప, కొత్తవారిని చేర్చలేదు.

మళ్ళీ దరఖాస్తులు..

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. కొత్త రేషన్ కార్డుల కోసం డిసెంబరు 28, 2023 నుంచి జనవరి 6, 2024 మధ్య దరఖాస్తులు స్వీకరించింది. ఆరు గ్యారంటీలతో పాటు ఇతర సంక్షేమ పథకాలకు రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకోవడంతో ప్రజల నుంచి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలన్న డిమాండ్ పెరిగింది. దీంతో అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మేరకు తాజాగా చర్యలకు ఉపక్రమించింది.