అక్షరటుడే, వెబ్‌డెస్క్: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 20వ తేదీ వరకు సమావేశాలు జరుగనున్నాయి. ఇందుకు సంబంధించి ఇటీవలే పార్లమెంట్‌లో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశాల్లోని సెషన్లలో ప్రవేశపెట్టబోయే బిల్లులు, ఇతర అంశాలపై సమావేశంలో చర్చించారు. భారతీయ వాయుయన్ విధేయక్ బిల్లు, విపత్తు నిర్వహణ(సవరణ) బిల్లు, రైల్వేస్(సవరణ) బిల్లు, బ్యాంకింగ్ చట్టాల(సవరణ) బాయిలర్స్ బిల్లు, పంజాబ్ కోర్టుల(సవరణ) బిల్లు, ఇండియన్ పోర్ట్స్ బిల్లు తదితర మొత్తం 16 బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రైతుల సమస్యలపై సమావేశాల్లో వాడీవేడి చర్చ జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.