అక్షరటుడే, ఆర్మూర్: నిజామాబాద్ జిల్లాలో రెండో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ కమిటీగా ఆర్మూర్ నిలుస్తుంది. కాగా.. నిజామాబాద్, వేల్పూర్, కమ్మర్‌పల్లి ఏఎంసీలకు ఛైర్మన్‌లను నియమించడంతో ఆర్మూర్ పీఠo ఎవరిని వరిస్తుందన్న చర్చ మొదలైంది. 2016 నవంబర్ నుంచి 2020 నవంబర్ వరకు మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా యామాద్రి భాస్కర్ పనిచేశారు. అనంతరం అప్పటి నుంచి ఛైర్మన్‌ పీఠం ఖాళీగానే ఉంది. కాగా ప్రస్తుతం ఛైర్మన్‌ పదవికి తీవ్ర పోటీ నెలకొంది. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జీవన్ తో పాటు పలువురు పోటీ పడుతున్నారు. అయితే సాయిబాబాగౌడ్ కు దక్కే అవకాశాలు ఉన్నాయనే చర్చ పార్టీ వర్గాల్లో సాగుతోంది. రెండు రోజుల్లో ఏఎంసీ పాలకవర్గాన్ని ఖరారు చేయనున్నట్లు సమాచారం. దీంతో ఆర్మూర్ మార్కెట్ కమిటీ పీఠం ఎవరికి దక్కుతుందో తేలనుంది.