అక్షరటుడే, వెబ్ డెస్క్: పెళ్లి చేసుకొని 26 వసంతాలు ఆనందంగా గడిపారు. కష్టసుఖాల్లో ఒకరినొకరు తోడుగా ఉన్నారు. 26వ వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. బంధుమిత్రులకు పార్టీ ఇచ్చారు. అర్ధరాత్రి వరకు సరదాగా గడిపారు. అందరూ వెళ్లిపోయాక ఇంట్లో ఉరేసుకుని తనువు చాలించారు. పెండ్లి రోజే దంపతులు సూసైడ్ చేసుకున్న ఘటన మహారాష్ట్రలోని నాగ్పూర్ లో చోటుచేసుకుంది.
జెరిల్ డామ్సన్ ఆస్కార్ మోన్ఫ్(57), భార్య అన్నీ(46) దంపతులు మార్టిన్ నగర్ ప్రాంతంలో ఉంటారు. 26వ పెళ్లిరోజు సందర్భంగా బంధుమిత్రులతో కలిసి కేక్ కట్ చేసి, అర్ధరాత్రి వరకు పార్టీ చేసుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున పెండ్లినాటి దుస్తువుల్లోనే శవాలై కనిపించారు. పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పార్టీలో దంపతులు చాలా ఆనందంగా కనిపించారని, నవ్వుతూ ఎంజాయ్ చేశారని బంధువులు తెలిపారు. ముందుగా భార్యను ఉరేసుకోమని చెప్పిన జెరిల్.. ఆమె చనిపోయిన తర్వాత డెడ్ బాడీని బెడ్ పై పెట్టి పూలతో అందంగా డెకరేట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వంటగదిలో జెరిల్ ఉరేసుకుని ప్రాణాలొదిలినట్లు వివరించారు.
జెరిల్.. చెఫ్ గా పని చేసేవారు. ఈ దంపతులకు పిల్లలు లేరు. వారిద్దరూ సూసైడ్ కు ముందు సోషల్ మీడియాలో ఒక స్టేటస్ ను కూడా అప్డేట్ చేసినట్టు తెలిసింది. ఒకదానిపై స్టాంప్ పేపర్, మరొకదానిపై అనధికారిక వీలునామాతో సహా రెండు సూసైడ్ నోట్లను అప్లోడ్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. తమ మరణానికి ఎవరూ బాధ్యులు కారని, తమ ఆస్తులను సరిగ్గా పంపిణీ చేయాలని దంపతులు సూసైడ్ నోట్లలో కోరినట్లు వెల్లడించారు.