అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: గొప్ప మరాఠా యోధుడు, దార్శనిక నాయకుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ దేశంలోనే అత్యంత గౌరవనీయమైన చారిత్రక వ్యక్తులలో ఒకరిగా నిలిచారు. శివాజీ ఫిబ్రవరి 19, 1630న మహారాష్ట్ర ఫుణే జిల్లాలో ఉన్న జనార్‌లోని శివనీర్ కోటలో జిజియాబాయ్, షహాజీ దంపతులకు జన్మించారు. ఆయన ఆగమనం శక్తివంతమైన మరాఠా సామ్రాజ్యానికి పునాది వేసింది. శివాజీ మహరాజ్​ గొప్ప పోరాట యోధుడు. ధైర్యానికి, శౌర్యానికి ప్రతీకగా నిలిచారు. మొగలులతో ఎన్నో యుద్ధాలు చేసి తన రాజ్యాన్ని విస్తరించారు. మరాఠా సామ్రాజ్యాన్ని ఏకతాటిపైకి తెచ్చి హిందూ ధర్మ రక్షణ కోసం పాటుపడ్డారు. ఈ రోజు(బుధవారం) ఆయన జయంతిని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. సామాజిక మాధ్యమాలతో ఆయన సూక్తులతో పోస్టులు పెడుతున్నారు. దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు.

గెరిల్లా యుద్ధ తంత్రం

శివాజీకి తన తల్లి పరమత సహనం, మహిళల పట్ల గౌరవంగా ఉండడం నేర్పారు. తన పుట్టిన గడ్డకు మేలు చేయాలని, ప్రజలతో ఎలా నడుచుకోవాలో జిజియాబాయి బోధించారు. జాగీరుగా ఉన్న తన తండ్రి దగ్గర నుంచి శివాజీ యుద్ధ విద్యలు నేర్చుకున్నారు. రాజనీతి మెళకువలు నేర్చుకుంటూ.. తన తండ్రి ఓటముల గురించి అధ్యయనం చేసి, సరికొత్త యుద్ధ తంత్రాలను రచించారు. గెరిల్లా యుద్ధ తంత్రాలను అవలంభించారు. మొఘలుల దాడులతో హిందూ మతం అంతరించి పోతుందని, వారితో యుద్ధంలో ఓడిపోయి అందరూ చేతులెత్తేసిన వేళ.. శివాజీ మహరాజ్ మండే నిప్పు కణికలా దూసుకొచ్చారు. మొగల్ రాజులతో వీరోచితంగా పోరాడారు. హిందూ సామ్రాజ్యాన్ని కాపాడరు. అంతటి మహాయోధుడి జయంతి రోజును యావత్ భారతం స్మరించుకుంటోంది.