అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: గణేశ్ నిమజ్జోత్సవ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. డీజే సౌండ్ కు యువకుడికి గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన మాక్లూర్ మండలం మాణిక్ భండార్ లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ముత్యంపల్లికి చెందిన ఊరడి మధు(28) ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. కాగా.. గణేశ్ నిమజ్జనం కోసం ట్రాక్ట్రర్ తీసుకుని మాణిక్ భండార్ వెళ్లాడు. శోభాయాత్ర సందర్బంగా డీజే పెట్టడంతో ఆ సౌండ్ కు గుండెపోటు వచ్చింది. దీంతో అక్కడే కుప్పకూలి మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఒక కూతురు ఉంది.