అక్షరటుడే, బాన్సువాడ: బీర్కూరు మండలం తిమ్మాపూర్ శివారులోని చెరువులో ఇద్దరు గల్లంతయ్యారు. సోమవారం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బాలేష్, గణేష్ ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై చెరువు కట్ట వద్దకు వెళ్లారు. గణేష్ ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు. గణేష్ ను రక్షించడానికి బాలేష్ ప్రయత్నించగా అతడు కూడా చెరువులో గల్లంతయ్యాడు. ఇంటి నుంచి వెళ్లిన ఇద్దరూ ఇంటికి చేరకపోవడంతో సాయంత్రం సమయంలో కుటుంబ సభ్యులు వారి కోసం గాలిస్తుండగా చెరువు వద్ద ద్విచక్ర వాహనం, చెప్పులను గుర్తించారు. వారిద్దరూ చెరువులో గల్లంతైనట్లు తెలుసుకున్నారు. చుట్టుపక్కల వారు వచ్చి చెరువులో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లతో చెరువులో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు మిత్రులు చెరువులో గల్లంతు కావడంతో తిమ్మాపూర్ లో విషాద ఛాయలు నెలకొన్నాయి. గణేష్ బీర్కూర్ లో పదో తరగతి చదువుతుండగా.. బాలేష్ మోటర్ మెకానిక్ గా పనిచేస్తున్నాడు.