అక్షరటుడే, వెబ్‌డెస్క్ : నీళ్లుతేవడానికి వెళ్లి కుంటలో పడి ఇద్దరు మృతి చెందిన ఘటన ఏపీలోని పల్నాడు జిల్లా దాచేపల్లిలో చోటుచేసుకుంది. మృతుల్లో ఓ విద్యార్థి, బస్ క్లీనర్ ఉన్నారు. ఎప్పటిలాగే.. విద్యార్థులంతా బస్సెక్కి దాచేపల్లి శ్రీచైతన్య స్కూల్‌కు బయలుదేరారు. మార్గ మధ్యలో బస్ రేడియేటర్‌లో నీళ్లు అయిపోవడంతో.. డ్రైవర్ వెంటనే బస్సును ఆపాడు. ఐదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని పిలిచి నీళ్లు తేవాలని పక్కనే ఉన్న కుంట దగ్గరికి పంపించాడు. ఆ విద్యార్థి డబ్బా తీసుకుని.. పొలంలో ఉన్న కుంట దగ్గరికి వెళ్లాడు.. అక్కడ డబ్బాలో నీళ్లు నింపుతూ ప్రమాదవశాత్తు విద్యార్థి కుంటలో జారి పడ్డాడు. అతన్ని కాపాడటానికి వెళ్లిన బస్సు క్లీనర్ కుంటలోని నీటిలో మునిగి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈత రాకపోవడంతో ఇద్దరూ నీళ్లలో పడి మృతిచెందారని పోలీసులు తెలిపారు. బస్సు డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన బాలుడిని పులిపాడు గ్రామానికి సుభాష్‌గా గుర్తించారు.