అక్షరటుడే, వెబ్ డెస్క్: వంట గ్యాస్ వినియోగదారులు తమ ఖాతాకు ఈకేవైసీ చేయించుకునేందుకు ఎలాంటి తుది గడువు లేదని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీ స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ కోసం కంపెనీ ఏజెన్సీ వద్దకే వెళ్ళాల్సిన అవసరంలేదని వివరించారు.
గ్యాస్ వినియోగదారుల ఈకేవైసీ నమోదు ప్రక్రియను చేపట్టాలంటూ గతేడాది కేంద్ర ప్రభుత్వం చమురు మార్కెటింగ్ కంపెనీలను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఎల్పీజీ కంపెనీలు ఈ ప్రక్రియను ప్రారంభించాయి. ఈ తరుణంలో గ్యాస్ ఏజెన్సీల వద్ద మాత్రమే ఈకేవైసీని నమోదు చేయాలని కొన్ని కంపెనీలు పట్టుబడుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై కేరళ శాసనసభా ప్రతిపక్ష నేత వీడీ సతీశన్.. ఇటీవల కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీకి లేఖ రాశారు. స్పందించిన కేంద్ర మంత్రి.. ఈకేవైసీ ప్రక్రియపై క్లారిటీ ఇచ్చారు. దీని నమోదుకు ఎలాంటి తుది గడువు విధించలేదని స్పష్టం చేశారు.
బోగస్ కస్టమర్లను తొలగించేందుకు..
బోగస్ కస్టమర్లను తొలగించేందుకు చమురు మార్కెటింగ్ సంస్థలు ఈకేవైసీ ఆధార్ అథెంటికేషన్ చేపడుతున్నాయి. గత కొద్ది నెలలుగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఎల్పీజీ డెలివరీ సిబ్బంది గ్యాస్ సిలిండర్లను డెలివరీ చేసే సమయంలోనే వినియోగదారుల వివరాలను వెరిఫై చేస్తారు. వారి చరవాణిలోని యాప్ లో వినియోగదారుల ఆధార్ వివరాలు నమోదు చేస్తారు. వినియోగదారులు సమీపంలోని డిస్ట్రిబ్యూటర్ కార్యాలయాలకు వెళ్లి కూడా దీన్ని పూర్తి చేయొచ్చు. దీంతో పాటు చమురు మార్కెటింగ్ సంస్థల యాప్ లను ఇన్స్టాల్ చేసుకొని సొంతంగా కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు” అని కేంద్రమంత్రి వివరించారు.
ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు చమురు సంస్థలు గానీ.. కేంద్ర ప్రభుత్వం గానీ ఎలాంటి తుది గడువు విధించలేదని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీ స్పష్టం చేశారు. ఎల్పీజీ ఏజెన్సీల్లోనే కచ్చితంగా ఈకేవైసీ నమోదు చేయాలనే నిబంధనేదీ లేదని వెల్లడించారు. వినియోగదారులకు కంపెనీలు ఎలాంటి అసౌకర్యం కలిగించవద్దని సూచించారు.