అక్షరటుడే, ఇందూరు: హిందువులు, హిందూ ఆలయాలపై దాడి జరిగినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు స్పందించాలని విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు దినేష్ ఠాకూర్ అన్నారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంపై జరిగిన ఘటనను నిరసిస్తూ శనివారం విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చౌరస్తాలో నిందితుడి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలన్నారు. అన్యమతస్తులపై దాడి జరిగితే స్పందించే రాజకీయ నాయకులు హిందువులపై జరిగినప్పుడు స్పందించకపోవడం శోచనీయమన్నారు. ఓట్ల కోసం వచ్చినప్పుడు ప్రజలంతా నిలదీయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి దయానంద్, విభాగ్ ప్రముఖ కృష్ణ, దాత్రిక రమేష్, బజరంగ్‌దళ్ నగర అధ్యక్షుడు అఖిల్, సురేష్, రాంప్రసాద్ పాల్గొన్నారు.