అక్షరటుడే, వెబ్ డెస్క్: అధికారంలోకి ఎవరు వచ్చినా.. వారికి అనుకూలంగా కార్యాలయాలను వాహనాలను ఇట్టే మార్చేస్తుంటారు. ఇందుకోసం కోట్ల రూపాయల ప్రజాధనం వృథా చేయడం పరిపాటిగా మారింది. కొత్త సచివాలయ భవనాన్ని గతేడాది ఏప్రిల్ లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. తాజాగా ఇక్కడ పలు పనులు చేపడుతున్నారు. వాస్తు కోసమో.. సుందరీకరణ కోసమో.. తెలియదు కానీ ఇందు కోసం రూ.3.20 కోట్లు వెచ్చిస్తున్నారు.

బాహుబలి మూసివేత

తూర్పు వైపు ఉన్న ప్రధాన (బాహుబలి గేటు) ద్వారాన్ని మూసేస్తున్నారు. ఈశాన్యం గేటుకు తూర్పు వైపున ప్రధాన ద్వారం రానుంది. డిసెంబరు 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఉండటంతో ఆ లోపు ఈ మార్పులు పూర్తి చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. బాహుబలి గేటు నుంచే మాజీ సీఎం కేసీఆర్ రాకపోకలు సాగించేవారు. ఈ గేటు నుంచి లోపల ప్రధాన ద్వారం వరకు కొంతకాలంగా రాకపోకలను నిలిపేశారు. ఈ దారిలోనే తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు లాన్, ఫౌంటెయిన్లు సమకూర్చుతున్నారు. నైరుతి, ఈశాన్య గేట్లను కలుపుతూ రోడ్డు వేయనున్నారు.