అక్షరటుడే, నిజామాబాద్‌ సిటీ: రైతులకు ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేయకుండానే కాంగ్రెస్‌ ప్రభుత్వం విజయోత్సవ సంబురాలు నిర్వహిస్తామనడం విడ్డూరంగా ఉందని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ విమర్శించారు. రైతులు చేయనున్న ధర్నాకు బీజేపీ తరపున పూర్తి మద్దతు తెలుపుతున్నామన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం చేసిన మోసాలు అన్నీఇన్నీ కావన్నారు. షరతుల్లేకుండా రుణమాఫీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు కొన్నిరోజులుగా అలాగే ఉన్నాయని ఇప్పటికీ పూర్తిస్థాయిలో కొనుగోళ్లు ప్రారంభం కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు రైతుబంధు లేదని, రుణమాఫీ పూర్తిగా చేయలేదని, సన్నబియ్యానికి రూ.500 బోనస్‌ ఇస్తామని ఇప్పటకీ ఇవ్వలేదన్నారు. తులం బంగారం విషయం కాంగ్రెస్‌ మరిచిపోయిందన్నారు. ప్రజల్లో రోజురోజుకూ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ద్వేషం పెరుగుతుందన్నారు. ఇందల్వాయిలోని గన్నారం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులను పరిశీలించారు. రైతులకు బీజేపీ అండగా ఉంటుందని తెలిపారు.