హైదరాబాద్, అక్షరటుడే: ప్రపంచ స్థాయి అత్యున్నత ప్రమాణాలతో హైదరాబాద్ ను అభివృద్ధి చేయాలనే తెలంగాణ ప్రభుత్వ సంకల్పానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. దావోస్ లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, హీరో మోటార్ కార్ప్ సంయుక్తంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ ను ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన, పర్యావరణ అనుకూల నగరంగా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసి రావాలన్నారు. ‘తెలంగాణ డ్రైపోర్టును నిర్మించి వేర్ హౌజ్ హబ్ గా తీర్చిదిద్దుతున్నాం. రాష్ట్రానికి తీరప్రాంతం లేని లోటును పూడ్చడానికి ఈ డ్రైపోర్టును మచిలీపట్నం పోర్టుకు రోడ్డు, రైల్వే మార్గాలతో అనుసంధానం చేస్తాం. నగరాల అభివృద్ధికి, వాటి భవిష్యత్తుకు అర్బన్ మొబిలిటీ భవిష్యత్తుకు పునాది. తక్కువ ఖర్చు, తక్కువ సమయంలో చేరుకునే రవాణా సదుపాయాలున్న నగరాలే ఎక్కువ కాలం మనగలుగుతాయి’ అని చెప్పారు.

నెట్ జీరో సిటీగా..

‘తెలంగాణలో నాలుగు కోట్ల మంది ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించేందుకు సహకరించాలని అందరినీ ఆహ్వానిస్తున్నాం. తక్కువ ఖర్చుతో ప్రజలు వేగంగా ప్రయాణించాలన్నది మా ప్రభుత్వ ఆకాంక్ష. అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం సమకూర్చుతుంది. తెలంగాణ భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికలో భాగంగా హైదరాబాద్‌లో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నాం. పర్యావరణహితంగా హైదరాబాద్ ను నెట్ జీరో సిటీగా తీర్చిదిద్దాలనేది మా అభిమతం’ అని అన్నారు.

రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ ఛార్జీల రద్దు

‘ప్రపంచంలోనే అత్యుత్తమ మొబిలిటీ అవకాశాలు హైదరాబాద్లో ఉండాలని కోరుకుంటున్నాం. ఎలక్టిక్ వెహికిల్స్ పై మేము ప్రత్యేక దృష్టిని సారించాం. ఎలక్ట్రిక్ వాహనాలపై రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ ఛార్జీలు రద్దు చేశాం. భారత దేశంలోనే ఈవీ వాహనాలు అత్యధికంగా అమ్ముడుపోయే రాష్ట్రం తెలంగాణ’ అని పేర్కొన్నారు.

3 వేల ఎలక్ట్రిక్​ బస్సులు..

‘మొబిలిటీ ఒక్కటే అన్నింటికీ పరిష్కారం కాదు. ఇప్పుడున్న పరిస్థితులను పర్యావరణ అనుకూలంగా మార్చాల్సిన అవసరం ఉంది. అందుకే గ్రేటర్ హైదరాబాద్ సిటీలో ప్రజా రవాణా వ్యవస్థలో 3 వేల ఎలక్ట్రిక్​ బస్సులు ప్రవేశపెడుతున్నాం’ అని సీఎం చెప్పారు.

జ్యూరిచ్ – దావోస్ రైలు ప్రయాణం అందమైన అనుభూతి

‘హైదరాబాద్ నగరంలో 1.2 కోట్లకు పైగా జనాభా ఉంది. దాదాపు 100 కిలోమీటర్లకు పైగా కొత్తగా మెట్రో లైన్లను నిర్మిస్తున్నాం. ఇప్పుడున్న దానికంటే ఇది రెండింతలు ఎక్కువ. నేను నా బృందంతో కలిసి జ్యూరిచ్ నుంచి దావోస్ కు రైలులో ప్రయాణించాం. అదొక అందమైన అనుభూతిని కలిగించే ప్రయాణం’ అని వర్ణించారు.

రేడియల్ రోడ్లతో ORR, RRR అనుసంధానం

‘ప్రస్తుతం హైదరాబాద్ చుట్టూ 160 కి.మీ మేరకు ఔటర్ రింగ్ రోడ్డు ఉంది. ఔటర్ రింగ్ రోడ్డు వెలుపల 360 కిలోమీటర్ల ప్రాంతీయ రింగ్ రోడ్డును నిర్మిస్తున్నాం. ఆ రెండు రింగ్ రోడ్లను కలుపుతూ రేడియల్ రోడ్లు కూడా నిర్మిస్తాం. రింగ్ రోడ్లకు అనుబంధంగా రింగ్ రైల్వే లైను నిర్మించాలనే ఆలోచనలున్నాయి’ అని తెలిపారు.