పేకాట కేసు.. తప్పించుకున్న ఫారెస్ట్ అధికారి ఎవరు..!

0

అక్షరటుడే, వెబ్ డెస్క్: మాక్లుర్ టౌన్ పరిధిలో నమోదైన ఓ పేకాట కేసులో ఫారెస్ట్ అధికారి ఒకరు తప్పించుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అటవీ శాఖలో సంఘం నేతగా ఉన్న సదరు అధికారి ఆర్మూర్ పరిధిలోని ఓ రేంజ్ బాధ్యతలు చూస్తున్నారు. కాగా.. సంక్రాంతి పండుగ సమయంలో మాక్లుర్ టౌన్ పరిధిలో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి జరిపారు. ఆ సమయంలో మొత్తం 8 మంది జుదరులను అదుపులోకి తీసుకున్నారు. కాగా.. వీరిలో సదరు ఫారెస్ట్ అధికారి కూడా ఉన్నట్లు సమాచారం. కానీ, మాక్లుర్ టౌన్ కు మాత్రం ఏడుగురి పేర్లను ఇచ్చారు. చివరకు పేకాట కేసు జాబితా నుంచి ఫారెస్ట్ అధికారి పేరు తప్పించినట్లు సమాచారం. కేవలం ఏడుగురి పైనే పేకాట కేసు నమోదు చేశారు. గతంలో జిల్లాలో పనిచేసి బదిలీపై వెళ్లిపోయిన ఓ జిల్లా స్థాయి అధికారి రంగంలోకి దిగడంతో ఫారెస్ట్ అధికారి పేరును తప్పించినట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవైపు సీపీ కల్మేశ్వర్ కఠినంగా వ్యవహరిస్తున్నా.. ఈ కేసులో కీలకమైన అధికారిని ఎలా తప్పించారన్నది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికైనా ఈ వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ జరిపించి నిజానిజాలు బయటకు తీయాల్సిన అవసరముంది.