మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలి

0

అక్షరటుడే, నిజామాబాద్‌ అర్బన్‌: సమాజానికి ప్రమాదకరంగా మారిన మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు ఆదేశించారు. ఇందుకోసం సంబంధిత శాఖలు సమన్వయంతో మరింత కఠినంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన జిల్లాస్థాయి మాదకద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. యువత, విద్యార్థుల భవిష్యత్తును నిర్వీర్యం చేస్తున్న మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలను నిరోధించడానికి కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు. వీటి రవాణా, వినియోగంపై గట్టి నిఘా పెట్టి అరికట్టాలన్నారు. వీటివల్ల కలిగే దుష్పరిణామాలపై పిల్లలు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. గంజాయి వంటి మత్తు పదార్థాలు ఎక్కడి నుంచి జిల్లాకు చేరుతున్నాయి, ఏయే ప్రాంతాల్లో ఎవరు విక్రయిస్తున్నారు తదితర వివరాలు సేకరించి నియంత్రించాలని పేర్కొన్నారు. సీపీ కల్మేశ్వర్‌ మాట్లాడుతూ మాదకద్రవ్యాల నిరోధానికి పోలీస్‌ శాఖ చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. అయినప్పటికీ జిల్లాలో మత్తు పదార్థాలు వినియోగం ఒకింత ఆందోళన కలిగిస్తోందన్నారు. రాష్ట్రంలో నిజామాబాద్‌ జిల్లా మొదటి మూడు స్థానాల్లో ఒకటి కావడం ఆందోళనకరమన్నారు. మత్తు పదార్థాల నియంత్రణకు ఎక్సైజ్‌ తదితర శాఖలకు పోలీసు శాఖ పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్‌ ఎం.మకరందు, అదనపు డీసీపీ జయరాం, ట్రెయినీ ఐపీఎస్‌ చైతన్య వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.