అక్షరటుడే, ఇందూరు: చందూరు మండల కేంద్రంలో ఐదు చెరువులు పూర్తిగా కబ్జాకు గురయ్యాయని మత్స్య పారిశ్రామిక సహకార సంఘం నాయకులు ఆరోపించారు. సోమవారం వారు కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపి, ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కబ్జాకు గురైన విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదన్నారు. 2009 నుంచి ఎన్నోసార్లు మండల అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. గ్రామంలో మత్స్య వృత్తిని నమ్ముకొని సుమారు 140 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని, చెరువులను కాపాడాలని కోరారు. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు పెద్ద పోశెట్టి, సాయిలు, రాములు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.