బిడ్డను అరెస్టు చేస్తే తండ్రి ఎందుకు వెళ్లలేదు..!

0

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: మాజీ సీఎం కేసీఆర్‌.. తన కూతురు కవితను ఈడీ అరెస్టు చేస్తే ఎందుకు స్పందించలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కనీసం అరెస్టు సమయంలో ఇంటికి కూడా వెళ్లలేదని పేర్కొన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో సర్వేలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉండడంతోనే బీజేపీ, బీఆర్‌ఎస్‌ కవిత అరెస్టు డ్రామాకు తెరతీశాయని ఆరోపించారు. హైదరాబాద్‌లో శనివారం మీడియాతో మాట్లాడారు. లిక్కర్‌ స్కాం కేసు పేరుతో బీజేపీ, బీఆర్‌ఎస్‌ చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. కవిత అరెస్టు విషయంలో కేసీఆర్‌, మోదీ స్పందించకపోవడం వెనుక వ్యూహం ఏమిటని ప్రశ్నించారు. గతంలో మోదీ వచ్చాక ఈడీ వచ్చేదని.. నిన్న మాత్రం మోదీ, ఈడీ కలిసి వచ్చాయని ఎద్దేవా చేశారు. ఎన్నికలు వచ్చిన ప్రతీసారి బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలను వాడుకుంటోందన్నారు. కవిత అరెస్టు సమయంలో ప్రధాని మోదీ రాష్ట్రంలోనే ఉన్నారని.. అయినా ఆయన ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను దొంగదెబ్బ తీసేందుకే ఆ రెండు పార్టీలు కుట్ర పన్నాయని ధ్వజమెత్తారు.

బీఆర్‌ఎస్‌లో ముగ్గురే మిగులుతారు

ప్రభుత్వాన్ని పడగొడతామనే ఆశల్లో బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఉన్నాయని.. అలాంటి చర్యలకు ప్పాలడితే తాము చూస్తూ ఉరుకోబోమని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. తమ ప్రభుత్వం గురించి ఆలోచిస్తే కేసీఆర్‌ పార్టీలో కేవలం ముగ్గురే మిగులుతారని వ్యాఖ్యానించారు. తాము దేనికైనా రెడీగా ఉన్నామని, తేదీ చెబితే సిద్ధమవుతామని స్పష్టం చేశారు.