అక్షరటుడే, కామారెడ్డి: ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ రద్దు చేసి జీవో ఇచ్చేలా ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని మాస్టర్ ప్లాన్ బాధిత రైతులు తెలిపారు. బుధవారం మున్సిపల్ కార్యాలయం వద్ద శ్రీకాంత్ రెడ్డి చేపట్టిన ఆమరణ దీక్షకు మద్దతు తెలిపారు. అనంతరం రైతులు పలు అంశాలపై చర్చించారు. మూడు రోజులుగా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడం, శ్రీకాంత్ రెడ్డి ఆరోగ్యం క్షిణిస్తుండడంతో నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. మాస్టర్ ప్లాన్ రద్దు జీవోపై కామారెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యేలతో పాటు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీలను కలుస్తామన్నారు. అప్పటికీ స్పందన రాకపోతే ఈ నెల 19 నుంచి 26 వరకు రోజుకొక గ్రామంలో రైతులంతా సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. గతంలో కంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పారు.