అక్షరటుడే, కామారెడ్డి: ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ చంద్ర మోహన్ ఆదేశించారు. శనివారం సదాశివనగర్, రామారెడ్డి, ఉప్పల్వాయి గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ.. నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ధాన్యాన్ని కేంద్రాలకు తెచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. గన్నీ సంచుల కొరత లేదని వివరించారు. అనంతరం కేంద్రాల నిర్వాహకులతో మాట్లాడుతూ.. కొనుగోళ్లలో తరుగు తీయరాదని, తూకం వేసిన వెంటనే ధాన్యాన్ని కేటాయించిన మిల్లులకు తరలించాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 218 కేంద్రాల ద్వారా 8,976 మంది రైతులకు చెందిన 56,936 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఆయన వెంట పౌర సరఫరాల జిల్లా మేనేజర్ నిత్యానందం, డిప్యూటీ తహసీల్దార్లు ఉన్నారు.