అక్షరటుడే, కామారెడ్డి: కామారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్ నిట్టు జాహ్నవిపై ప్రవేశపెట్టిన అవిశ్వాసం నెగ్గింది. శనివారం బల్దియా కార్యాలయంలో కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆధ్వర్యంలో అవిశ్వాస తీర్మాన సమావేశాన్ని నిర్వహించారు. బల్దియాలో మొత్తం 49 మంది కౌన్సిలర్లు ఉండగా.. సమావేశానికి అందరు హాజరయ్యారు. వీరిలో 37 మంది అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేయడంతో తీర్మానం నెగ్గినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో చైర్‌పర్సన్ నిట్టు జాహ్నవి పదవిని కోల్పోవాల్సి వచ్చింది. ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ వచ్చిన అనంతరం కొత్త చైర్‌పర్సన్ ఎన్నిక తేదీ నిర్ణయించనున్నారు. మున్సిపాలిటీ హస్తగతం కానుండగా.. చైర్‌పర్సన్ రేసులో ఇద్దరు కౌన్సిలర్లు ఉన్నారు. వైస్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ, మరో కౌన్సిలర్ ఉర్దోండ వనిత పేర్లు వినిపిస్తున్నాయి. సమావేశం ముగియడంతో కౌన్సిలర్లను మరోసారి క్యాంపునకు తరలించే అవకాశం ఉంది.