అక్షరటుడే, వెబ్ డెస్క్: ఎలాంటి అవినీతికి తావులేకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పని చేస్తోందని ఎంపీ అరవింద్ ధర్మపురి అన్నారు. రైతుల మేలు కోసమే ప్రధాని మోదీ నిరంతరం పని చేస్తున్నారని చెప్పారు. ఆర్మూర్ పట్టణంలో బుధవారం నిర్వహించిన చాయ్ పే చర్చ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులు, యువత ఎంపీ దృష్టికి పలు విషయాలు తీసుకెళ్లారు. అనంతరం అరవింద్ మాట్లాడుతూ.. కిసాన్ సమ్మాన్ నిధి కింద కేంద్రం రైతులకు ఆర్థిక సాయం అందిస్తుందని తెలిపారు. గత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు, పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వకపోవడం వల్లే కొందరికి ఇంకా కిసాన్ సమ్మాన్ డబ్బులు రావట్లేదన్నారు. జిల్లాకు పసుపు, జగిత్యాలకు మామిడి పంటలను వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ కింద ఎంపిక చేశామని గుర్తు చేశారు. ఈ రెండు పంటల ఎగుమతులపై కేంద్రం ప్రత్యేక చర్యలు తీసుకుందని చెప్పారు. ఫలితంగా మునుపెన్నడూ లేనివిధంగా ఈ సీజన్లో పసుపు ధర రూ.20 వేలు దాటిందని చెప్పారు. బోర్డు కార్యకలాపాలు మొదలైతే.. విత్తనాలు, భూసార పరీక్షలు మొదలు అన్ని అంశాలపై దృష్టి ఉంటుందని వివరించారు. పరిమితంగా ఎరువులు వాడితే పసుపు ఎగుమతులకు డిమాండ్ ఉంటుందని, ఆ దిశగా రైతులు పంట సాగుపై దృష్టి పెట్టాలన్నారు. తాను ఎంపీగా గెలిచిన మొదట్లో కేవలం ఒకే ఒక్క రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ఉందని, ఇప్పుడు ఏడు రైల్వే వంతెనలు తీసుకువచ్చానని చెప్పారు. అవినీతి కారణంగానే చక్కెర పరిశ్రమలు తెరుచుకోవడం లేదన్నారు. తెలంగాణలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు నిజామాబాద్ జిల్లా అనువైన ప్రాంతమని, తిరిగి బీజేపీ అధికారంలోకి రాగానే పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అప్పుడే గల్ఫ్ వలసలు తగ్గి యువతకు స్థానికంగా ఉపాధి లభిస్తుందని తెలిపారు. రైతుల మేలు కోరి కేంద్రం వరి మద్దతు ధరను రూ.2,200 కు పెంచిందని.. సొసైటీల్లో తరుగు పేరిట నిలువు దోపిడీ మానుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి కొమ్ము కాస్తోందని ఆరోపించారు. ఆర్మూర్ పట్టణంలోని జీవన్ మాల్ విషయంలో అధికారంలోకి వచ్చిన వెంటనే నోటీసులు ఇచ్చి హడావుడి చేశారని.. ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు, అధికారులకు డబ్బులు ముట్టజెప్పగానే చర్యలు మరిచారన్నారు. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కు రూ.50 కోట్లు బకాయిలు ఉన్నాయని, ఆర్టీసీ, మున్సిపాలిటీకి డబ్బులు చెల్లించాల్సి ఉన్నా.. ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. నిజామాబాద్ మార్కెట్ యార్డుకు పసుపు లావాదేవీల ద్వారా ఏటా రూ.20 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని.. ఈ నిధులను కొన్నేళ్లుగా సిరిసిల్ల, సిద్ధిపేటకు తరలిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముస్లింలకు సైతం పౌరసత్వం ఇవ్వాలని గతంలో ఆందోళన చేశారని.. ఇప్పుడు ఎన్నికలు ఉన్నందున సీఏఏ అమలు చేస్తున్నా కేవలం హిందువుల ఓట్ల కోసం సైలెంట్ గా ఉన్నారని అరవింద్ ఆరోపించారు.