రుణమాఫీ చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా!

0

అక్షరటుడే, బోధన్: బీజేపీ నేత ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ సర్కారు ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని పేర్కొన్నారు. బోధన్ లో జరిగిన విజయ సంకల్ప యాత్రలో ఈటెల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ తో కలిసి ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల అమలు చేయకుండా మోసం చేస్తోందని పేర్కొన్నారు. కేవలం పార్లమెంట్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని గ్యారెంటీల అమలు పేరిట హడావిడి చేస్తున్నారని విమర్శించారు. దేశం సురక్షితంగా ఉండి ప్రపంచంలో అగ్రగామిగా నిలవాలంటే బీజేపీకి ఓటు వేయాలని కోరారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ పై కాంగ్రెస్ పార్టీ వేసిన కమిటీ పెద్ద బూటకమని ఎంపీ అరవింద్ అన్నారు. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, పల్లె గంగారెడ్డి, దినేశ్ కులాచారి, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.