అక్షరటుడే, వెబ్ డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. అనంతరం శంషాబాద్ విమానశ్రయానికి తీసుకెళ్తున్నారు. అక్కడి నుంచి రాత్రి 8.45 గంటలకు విమానంలో ఢిల్లీకి తీసుకెళ్లనున్నారు. శనివారం ఉదయం ఢిల్లీలోని ఈడీ ప్రత్యేక కోర్టులో కవితను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మరోవైపు ఎమ్మెల్సీ అరెస్టు నేపథ్యంలో ఆమె ఇంటి వద్ద హైడ్రామా కొనసాగింది. బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. సుప్రీం కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఈడీ వ్యవహరిస్తోందని ఆయన పేర్కొన్నారు. అరెస్టుకు గల కారణాలను తెలుపుతూ కవిత భర్త అనిల్‌కు ఇంటిమేషన్ ఆఫ్ అరెస్ట్ కాపీని ఈడీ అధికారులు అందజేశారు. కవితను తరలించే క్రమంలో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్రమ అరెస్టును న్యాయపరంగా ఎదుర్కొంటామని, పార్టీ శ్రేణులు సంయమనం పాటించాలని కేటీఆర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
