అక్షరటుడే, నిజామాబాద్: గ్రామాభివృద్ధి కమిటీలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోరాదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఛైర్ పర్సన్ సునీత కుంచాల సూచించారు. జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన వీడీసీలతో శనివారం నిర్వహించిన సదస్సులో ఆమె ప్రసంగించారు. చట్టపరిధిలో పనిచేస్తే అందరికీ సంతోషమేనని.. చట్టవ్యతిరేకమైన చర్యలకు పాల్పడితే ఆమోదయోగ్యం కాదన్నారు. తెలిసి చేసినా, తెలియక చేసినా నేరమే అవుతుందని స్పష్టం చేశారు. చట్టాలకు అనుగుణంగా కార్యక్రమాలు చేస్తే అన్ని ప్రభుత్వ శాఖల తోడ్పాటు లభిస్తుందని పేర్కొన్నారు. అనంతరం పొలీస్ కమిషనర్ కల్మేశ్వర్ మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధి కమిటీ పేరులోనే అభివృద్ధి అనే పదం ఉందని, దాన్ని తప్పు పట్టగలమా..? అని ఆయన ప్రశ్నించారు. కుల బహిష్కరణలకు పాల్పడడం, సామాజిక దండనలు, వెలివేతల కారణంగానే వీడీసీలపై కేసులు నమోదు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. గ్రామస్థాయిలో చట్టవ్యతిరేకమైన నిర్ణయాలు, తీర్మానాలు చేయరాదని సూచించారు. న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ
కార్యక్రమంలో ఏసీపీ రాజా వెంకటరెడ్డి, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ యెండల ప్రదీప్, నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఆశ నారాయణ, న్యాయసేవ సంస్థ సూపరింటెండెంట్ పురుషోత్తం గౌడ్, గ్రామ అభివృద్ధి కమిటీల సభ్యులు, వివిధ పోలీస్ స్టేషన్ల అధికారులు పాల్గొన్నారు.