అక్షరటుడే, ఇందూరు: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ఎన్నికల సన్నద్ధతలో భాగంగా ఏర్పాట్లను మరింత ముమ్మరం చేయాలని సూచించారు. కలెక్టరేట్‌లో శనివారం సీపీ కల్మేశ్వర్‌తో కలిసి సహాయ రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల్లో సదుపాయాలు, సమస్యాత్మక కేంద్రాల గుర్తింపు, భద్రత ఏర్పాట్లు, చెక్‌పోస్టులు, ఎస్‌ఎస్‌టీ, ఎఫ్‌ఎస్‌టీ బృందాల ఏర్పాటుపై అధికారులకు కలెక్టర్ మార్గనిర్దేశం చేశారు. పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో సందర్శించి పరిస్థితులను పరిశీలించాలన్నారు. అంతర్రాష్ట్ర, జిల్లా సరిహద్దుల వద్ద తనిఖీ కేంద్రాలను నెలకొల్పేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా ఎన్నికల సంఘానికి వెనువెంటనే నివేదికలను పంపాల్సి ఉంటుందని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రెయినీ ఐపీఎస్ చైతన్య రెడ్డి, ఆర్డీవోలు రాజేంద్ర కుమార్, రాజాగౌడ్, ఏసీపీలు రాజా వెంకట్‌రెడ్డి, బస్వారెడ్డి, శ్రీనివాస్, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్ పాల్గొన్నారు.