అక్షరటుడే,ఆర్మూర్: బీజేపీ ఓటు బ్యాంకును చీల్చడం ఎవరి వల్ల కాదని, తమ ఓటు బ్యాంకు మూడింతలు పెరిగిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలో గురువారం నిజామాబాద్ పార్లమెంటరీ స్థాయి కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ.. మున్నూరు కాపు కులంలో ఓట్లు కత్తెర పెట్టటానికే బాజిరెడ్డి గోవర్ధన్ ను కవిత పోటికి పెట్టారన్నారు. అయితే బాజిరెడ్డి గతంలో కాంగ్రెస్ నుంచి వచ్చారని, ఆయన కాంగ్రెస్ ఓట్లు మాత్రమే చీల్చుతారని పేర్కొన్నారు. తమది జాతీయ భావం, హిందుత్వంతో కూడిన ఓటు బ్యాంక్ అని గుర్తు చేశారు. అనంతరం శాసనసభా పక్ష నేత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 400కు పైగా సీట్లు వస్తాయన్నారు. తమ పార్టీని ఢీకొట్టడం ఎవరి వల్ల సాధ్యం కాదన్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, ఏలేటి మల్లికార్జున్ రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, పల్లె గంగారెడ్డి, పెద్దోళ్ల గంగారెడ్డి, పుప్పాల శివరాజ్, జీవీ నరసింహారెడ్డి, ఆకుల శ్రీనివాస్, కలికోట గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.