అక్షరటుడే, ఇందూరు: పసుపు ధర పసిడితో పోటీ పడుతోంది. తాజాగా ఆల్‌టైం రికార్డుకు చేరుకుంది. గురువారం సాంగ్లీ మార్కెట్‌లో రూ.20 వేల మార్కును దాటింది. ఆర్మూర్‌కు చెందిన రైతు మల్లయ్య సాంగ్లీ మార్కెట్‌లో 12 క్వింటాళ్లు విక్రయించగా క్వింటాకు రూ.20,500 పలికింది. అలాగే జిల్లాకు చెందిన మరో రైతు శ్రీనివాస్‌కు రూ.20,150 ధర లభించింది. దీంతో పసుపు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రైతు మల్లయ్య మాట్లాడుతూ.. ఏళ్లుగా పసుపు సాగు చేస్తున్నానని.. గతంలో ఎన్నడూ ఈ ధర పలకలేదని తెలిపారు. రూ.20 వేలకు పైగా రేటు రావడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ఎంపీ అర్వింద్ కృషితో పసుపు రేటు భారీగా పెరిగింది. ముఖ్యంగా ఆయన పసుపు ధరను రూ.20 వేలు దాటిస్తానని చెప్పి మాట నిలబెట్టుకున్నారు. ఈ సందర్భంగా అరవింద్ స్పందిస్తూ..కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగానే పసుపు ధర ఈ స్థాయిలో పెరిగిందని పేర్కొన్నారు. ఇన్నాళ్లకు పసుపు రైతులకు న్యాయం జరిగిందన్నారు. కేంద్రం పసుపు ఎగుమతులను ప్రోత్సహించడం, దిగుమతులను తగ్గించడం వల్లే ఈ రేటు పలుకుతోందని చెప్పారు. అతి త్వరలో పసుపు బోర్డు ఏర్పాటవుతుందని పునరుద్ఘాటించారు.