అక్షరటుడే, బాన్సువాడ: ఇసుకాసురులు మంజీర నదిని తోడేస్తున్నారు. అక్రమంగా ఇసుక తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అనుమతులు లేకుండా అర్ధరాత్రులు తవ్వకాలు చేపట్టి పట్టణాలు, నగరాలకు తరలిస్తున్నారు. ఆరు నెలలుగా ఈ దందా కొనసాగుతోంది. అయినా అధికారులు చోద్యం చూస్తున్నారు.

అడ్డుకుంటే బెదిరింపులు

బీర్కూర్ మండలం బరంగేడ్గి మంజీర తీర ప్రాంతంలో అనుమతులు లేకుండా ఇసుకను జోరుగా తరలిస్తున్నారు. ఆదివారం స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్రమ రవాణాపై అధికారులకు ఫిర్యాదు చేశారు. అక్రమార్కులపై చర్యలు తీసుకోలేదు. పైగా అక్రమార్కులు స్థానికులను బెదిరించి ఇసుక తరలించడం గమనార్హం.

డంప్​ చేసి..

పోతంగల్ మండలం కొడిచెర్ల నుంచి రాత్రిపూట అక్రమంగా ట్రాక్టర్లలో ఇసుకను తరలించి ఓ చోట డంప్ చేస్తున్నారు. డంపు చేసిన ఇసుకను టిప్పర్లలో రాజధానికి తరలిస్తున్నారు. మంజీర తీర ప్రాంతంలో అనువుగా ఉన్న ప్రాంతాలను ఎంపిక చేసుకుని డంపులు ఏర్పాటు చేసి అక్కడి నుంచి టిప్పర్ల ద్వారా రవాణా చేస్తున్నారు.