అక్షరటుడే, కామారెడ్డి: ఆలయంలోని హుండీ చోరీకి యత్నించిన ఓ దొంగ.. అందులో చెయ్యి ఇరుక్కుపోవడంతో దొరికిపోయాడు. భిక్కనూరు మండలం రామేశ్వర్పల్లి గ్రామ శివారులోని మాసుపల్లి పోచమ్మ ఆలయంలో మంగళవారం రాత్రి ఓ దొంగ చోరీకి వచ్చాడు. హుండీని ధ్వంసం చేసి అందులో నుంచి డబ్బులు తీసుకునేందుకు చెయ్యిపెట్టగా ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నించినా చెయ్యి రాకపోవడంతో చేసేదేమీ లేక పొద్దున వరకు అలాగే ఉన్నాడు. ఉదయం భక్తులు ఆలయానికి వచ్చేసరికి దొంగ హుండీలో చెయ్యి ఇరుక్కుపోయి కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కట్టర్ సాయంతో హుండీ కట్ చేయించి దొంగను అదుపులోకి తీసుకున్నారు. ఆలయంలో పనిచేసే సురేష్ అనే వ్యక్తే దొంగ కావడం గమనార్హం.