అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని ట్రెయినీ కలెక్టర్ సంకేత్ కుమార్ సూచించారు. నిజామాబాద్ కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 64 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను ట్రెయినీ కలెక్టర్ తో పాటు మెప్మా పీడీ రాజేందర్, ఇన్ ఛార్జి డీపీవో శ్రీనివాస్, నిజామాబాద్ ఏసీపీ కిరణ్ కుమార్ లకు అర్జీలు సమర్పించారు. కాగా.. దరఖాస్తులను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని ట్రెయినీ కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.