అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: నగరంలోని 12, 13, 14, 15 డివిజన్లకు సంబంధించి రేషన్‌ దుకాణాలు ప్రజలకు దూరంగా ఉన్నాయని ఎంఐఎం నాయకులు పేర్కొన్నారు. వాటిని సమీప ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతును కోరారు. ఈ మేరకు మంగళవారం కలెక్టర్ కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్లమ్‌ ఏరియాల్లోని మైనార్టీలకు రేషన్‌ దుకాణాలు దూరంగా ఉండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. అలాగే ఆటోనగర్, డెయిరీ ఫారం, సాగర్‌ హిల్స్, ధర్మపురి ప్రాంతాల్లో విద్యుత్‌ కోతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కొత్తగా 33/11కేవీ సబ్‌స్టేషన్‌ ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు మహ్మద్‌ ఫయాజ్, నాయకులు షకీల్‌ అహ్మద్‌, కార్పొరేటర్లు పాల్గొన్నారు.