అక్షరటుడే, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్​లోని ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ బాలుడిని మారు తండ్రి దారుణంగా చిత్రహింసలకు గురి చేశాడు. ఫోన్ ఛార్జింగ్ వైరుతో కొట్టి చిత్రహింసలకు గురిచేయడంతో బాలుడి శరీరం పూర్తిగా కమిలిపోయింది. కొంతకాలంగా తనను కొడుతున్నారని, కొట్టిన తర్వాత గాయాలపై కారం చల్లుతున్నారని కన్నీటి పర్యంతమయ్యాడు ఆ బాలుడు. తన చెల్లెల్ని సైతం ఇదేవిధంగా కొడుతున్నట్లు చెప్పుకొచ్చాడు. తీవ్ర గాయాలతో ఆస్పత్రికి వచ్చిన బాలుడి పరిస్థితి చూసి వైద్యులే చలించిపోయారు. స్థానికులు రక్షించి వైద్యుల దగ్గరికి తీసుకురావడంతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.