అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : తిరుపతిలో జరిగిన వైకుంఠ ద్వారా దర్శన టికెట్స్ జారీ తొక్కిసలాట ప్రాంతం బైరాగిపట్టేడను సీఎం చంద్రబాబు నాయుడు గురువారం పరిశీలించారు. తొక్కిసలాటకు గల కారణాలను ఈవో శ్యామలరావుని అడిగి తెలుసుకున్నారు. పద్ధతి ప్రకారం పని చేయాలని, బాధ్యతగా ఉండాలని తెలియదా అంటూ అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యత తీసుకున్నప్పుడు నెరవేర్చాలని తెలియదా.. తమాషా అనుకోవద్దని వ్యాఖ్యానించారు. పరిమితికి మించి భక్తులను లోపలకి ఎందుకు అనుమతించారని ప్రశ్నించారు. ఘటన జరిగినప్పుడు మీరేం చేస్తున్నారని అడిగారు. భక్తులు కూర్చున్నప్పుడు పరిస్థితి బాగానే ఉందని.. బయటకు వదిలేప్పుడు పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పిందని అధికారులు వివరించారు. అనంతరం తొక్కిసలాటలో గాయపడి స్విమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఆయన వెంట టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌నాయుడు, ఈవో శ్యామలరావు, మంత్రులు, తిరుపతి కలెక్టర్‌ , ఎస్పీ ఉన్నారు.